కమిటీలు… నిర్ణయాలు…

ఇప్పుడు నారాయణా అన్నా తెలంగాణా అన్నా ఒకటే పరిస్థితి. రాయాలని ఇష్టం లేకపోయినా, తప్పడం లేదు… నోరు మూసుకొని కూర్చోవడం యోగికి సరి కానీ, బ్లాగుకు సరి కాదు.

ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది అయినా, ఒక దేశ/రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది అయినా సరైన సమయంలో, సరైన విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఆలస్యం, నాన్చుడు ధొరణి వలన పరిస్థితి జటిలం కావడం మినహా ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందుకే పెద్దలు ఆలస్యం-అమృతం-విషం అని అన్నారు.

ఒక్కసారి విభేధాలు ముదిరితే, వినాశనానికి ఉన్నన్ని అవకాశాలు సంబంధాలు మెరుగవడానికి ఉండవు. భారత దేశానికి అయినా, భార్యాభర్తలకు సంబంధించినది అయినా ఇది ఒకే విధంగా వర్తిస్తుంది.

ఇప్పుడు ఒక సామరస్యపూరిత పరిష్కారాన్ని వెతకడం కన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదు. సమం ఉన్నప్పుడే సామరస్యం ఉంటుంది – నమ్మకం, విశ్వాస చర్యలతో కాపాడుకోవాల్సిన దానిని బలంతో ఎన్నటికీ సాధించలేము. పోలీసులను పెట్టి, మీడియాను కట్టేసి సరిదిద్దాలనుకోవడం మిగిలిన ఏకైక మార్గం, చిట్టచివరి కార్యక్రమం.

ఆ తరువాత సినిమాలో ఏం జరుగుతుందో జీవితంలోనూ అదే జరుగుతుంది. మానసికంగా సన్నిద్ధులు కండి!

పరస్పర లాభం లేని బేరం ఎప్పడూ శాంత పరిణామాలకు దారితీయదు. ఇచ్చిపుచ్చుకునే ధొరణి వల్ల వ్యాపారం బంధం అయినా, వ్యక్తిగతమైన బంధం అయినా ఎక్కువ కాలం మన్నుతుంది. ఇది ఇక్కడ గ్రహించాల్సిన విషయం. ఆంధ్ర రాజకీయాలు ప్రాంతీయ కుతంత్రాలకు, వ్యక్తిగత లాభాలకు పెట్టిన శ్రద్ధను ప్రజల మధ్య సామరస్యతకు పెట్టలేదు అని నేటి ఫలితాలు తెలుపుతున్నాయి.

హృదయాన్ని గెలుచుకోవాలంటే వంగి అర్ధించడమే సరైనది. కిరీటాన్ని తన్నినా శ్రీ కృష్ణుడు కాలు కందిపోయింది అని బాధ పడినట్టు. కోట్లాది హృదయాలను గెలుచుకోవలంటే ఐదు టీఎంసీల నీరో, గతాన్ని సరిదిద్దుకున్నట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. అలా కాకుండా వ్యతిరేక చర్యలు చేపట్టి, కౌరవ న్యాయాన్ని ప్రదర్శించాలనుకోవడం పూర్తిగా తెలివితక్కువ పని.

కుతంత్రాలు పన్నుతూ, కులాల రాజ్యాన్ని కొనసాగిస్తూ, రాజీవ నామస్మరణతో కాలాన్ని ఈదడం అనే దద్దమ్మ ఉపాయాల వల్ల సమస్యలు పరిష్కారం కావు.

మంచితనాన్ని మించినది లేదు… ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో…

This entry was posted in సంసారం and tagged , . Bookmark the permalink. Post a comment or leave a trackback: Trackback URL.

20 Comments

  1. krishna
    Posted January 8, 2011 at 3:21 PM | Permalink

    “ఇప్పుడు నారాయణా అన్నా తెలంగాణా అన్నా ఒకటే పరిస్థితి.”
    :)

    ” హృదయాన్ని గెలుచుకోవాలంటే వంగి అర్ధించడమే సరైనది. ”
    బాబ్బాబు ఆ ముక్క ఎదో, మా తెలంగాణా దొరకు కూసింత సెప్పకూడదు. మా దొరకు “నాలుకలు కోస్తాం” అనటమే సరైంది అని మెతావులు ఎవరో సెప్పినారంట మరి.

    “గతాన్ని సరిదిద్దుకున్నట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది”

    నిజమే గతాన్ని సరిద్దిద్దాల్సిందే అందరమూ, ఏ గతాన్ని, నిజాం రాజ్గోరు మంచోరు అనే నిజాన్నా? రజాకార్లు సేసిన రేపులవల్ల మంచి జరిగింది అని పరోక్షంగా సెప్పే తెలబాన్ దొరలు సెప్పే గతాన్నా? లేక అసలు లెక్కలు కాక కాకి లెక్కలు సెప్పే గతాన్నా? ఆ గతాన్ని సరి చేయాలనే ఓ పక్క సీకాకులం ఓళ్లు, మరో పక్క తీరమంతా పోయిన పెకాసం వోళ్లు, మరో పక్క తాగటానికి నీళ్ళు లేని రాజుల సీమోళ్లు కూడా సెప్తుంది. 22 జిల్లాల లను కుదవపెట్టి ఓ ఊర్లో పోసిన గతాన్న? అందులో ఎకాభిప్రాయమే, ఒక్క నిజాం భక్తులు, వారి బాంచెన్ లకు తప్ప :)

    “కుతంత్రాలు పన్నుతూ, కులాల రాజ్యాన్ని కొనసాగిస్తూ, రాజీవ నామస్మరణతో కాలాన్ని ఈదడం అనే దద్దమ్మ ఉపాయాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. ”

    నిజమే ఒప్పుకోవాల్సిందే, అలాగే దొరగారి కుటుంబానికి కాల్మొక్కుతూ, దందాగిరికి వత్తాసుపలుకుతూ ఉన్నంత కాలంకూడా ఏ పరిష్కారాలు కూడా రావేమో!!

    “మంచితనాన్ని మించినది లేదు… ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో…”

    నిజమే, అందుకే గోడలు కడతాము, నాలుకలు చీలుస్తాము, సంక్రాంతి ఊర్లు వెల్తే తిరిగి రానీయం అనేది, కాకపోతే మా మంచితనాన్ని అర్ధంచేసుకోరు అంతే :)

  2. meena
    Posted January 8, 2011 at 4:54 PM | Permalink

    Sir,
    I aplogise for not being to able to post in telugu font.
    You said it !!!!!!
    Nijamga samikyanga vunchadam oka parishkaram aina. paddati matram edi kaane kaadu.

  3. Goutham Navayan
    Posted January 8, 2011 at 10:07 PM | Permalink

    విడిపోయినా గొడవలు తప్పవు.
    కలసి వున్నా గొడవలు తప్పవు. (మరింత పెరుగుతాయి.)
    కాబట్టి ఇప్పుడిక ఆలోచించాల్సింది అందరికీ ఆమోదయ యోగ్యమైన పరిష్కారం గురించి కాదు.
    (అసలు అట్లాంటి పరిష్కారం వుండదు )
    ఏది న్యాయం అన్నదాని గురించి.
    ఆంధ్రా లో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుని కలిపినా తెలంగాణా (హైదరాబాద్ ) రాష్ట్రాన్ని
    పునరుద్ధరిమ్చడమే న్యాయం.
    ఇది పార్లమెంటులో ఆల్ రెడీ ప్రకటించారు కూడా.

  4. నాగన్న
    Posted January 8, 2011 at 10:47 PM | Permalink

    @krishna
    తెలంగాణా ప్రాంత ప్రజలు రాజకీయ నాయకులను నమ్మడం మానేసారు. విద్యార్ధులను, వీధి పోరాటాలను నమ్ముకున్నారు. అందుకే మిలిటరీ రాజ్యం వాళ్ళ నెత్తి మీద పడింది.

    @meena
    ఒప్పుకుంటాను.

    @Goutham Narayan
    న్యాయం అన్యాయం గురించి కూడా ఆలోచించడం వృధా శ్రమ. జరిగేది ఎలాగూ జరగక మానదు… ఎవరికి ఎంత లాభం అని లెఖ్ఖలు వేసుకుంటున్నారు కొత్త పెద్దమనుషులు.

  5. Posted January 9, 2011 at 12:31 AM | Permalink

    చాలా నాగరికంగా వ్రాశారు. కానీ తటస్థత లోపించింది.

    మీరు చాలా విషయాలు విస్మస్తున్నారు. తెలంగాణకు నీరివ్వడం ఆంధ్రావారి చేతుల్లో లేదు. (ప్రాథమికంగా అది తెలంగాణకు దిగువప్రాంతం కావడం కూడా ఒక కారణం) ఈరోజు అది ఆంధ్రప్రభుత్వం చేతుల్లో కూడా లేదు. ఎక్కడికక్కడ నదీజలాల ట్రిబ్యునల్స్ పట్టు బిగిస్తున్నాయి. ఏ కారణం చేతనో వాళ్ళ దగ్గఱ ఆంధ్రప్రభుత్వానికి పలుకుబడి లేదు. ఎగువరాష్ట్రాలు డజన్ల కొద్దీ ఆనకట్టలూ, జలాశయాలూ కట్టి తెలుగువాళ్ళకు రావాల్సిన నీళ్ళు దోచుకుంటున్నారు. దానికి ఈ ట్రిబ్యునళ్ళ అనుమతి కూడా తెచ్చుకుంటున్నారు. మనకు అనుమతి ఉన్న నీళ్ళని వివిధ జిల్లాలకు సరిపోయేలా ఎలా పంచాలో అర్థం కాని పరిస్థితి దాపఱించింది. ఎందుకంటే వాస్త వికమైన/ ఆధారణీయ నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. జనాభా మాత్రం చాలా ఎక్కువగా ఉంది. (ఏ జిల్లాకూ 30 – 40, కొన్నిసార్లు 50 లక్షలకు తక్కువ జనాభా లేదు) తత్ఫలితంగా ఆంధ్రా-తెలంగాణ మధ్యనే కాదు, కరీంనగర్ కీ, వరంగల్ కీ మధ్య కూడా వాటర్ వార్స్ తలెత్తుతున్నాయి, వేసవికాలం రాగానే !

    ప్రతి చిన్న/ పెద్ద విషయానికీదానికీ తప్పంతా ఇతరప్రాంతాల మీద నెట్టడం ఇటీవల తెలంగాణలో ఒక అలవాటుగా పరిణమించింది. ఈ మధ్య ప్రతి తెలంగాణవాడూ ఒక కేసీయార్ లా మాట్లాడడం నేర్చుకున్నాడు. కోస్తా ఆంధ్రకూ, తెలంగాణకూ అభివృద్ధిలో భారీ వ్యత్యాసాలు లేవని శ్రీకృష్ణ కమిటీ సాక్ష్యాధారాలతో సహా, గణాంకాలతో సహా నిరూపించిన తరువాత కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. విడిపోవడానికి తగినంత కారణాల్ని చూపించలేకపోవడం చాలామంది వీర తెలంగాణవాదులకు అశనిపాతంగా, గుండెపోటుగా పరిణమించింది. శ్రీకృష్ణ కమిటీకి ఆంద్రోల్లు పైసలిచ్చిన్రంట. ఆ పైసలు తామెందుకు ఇవ్వలేకపోయారో, ఇచ్చి ఆ నివేదికని తమకనుకూలంగా ఎందుకు వ్రాయించుకోలేకపోయారో వారు చెబితే బావుంటుంది.

    గతం గాయాల్ని మాన్పే బాధ్యత తెలంగాణవాదులదే. తెలంగాణలో తమమీద ఈ పదేళ్ళలో నిష్కారణంగా జల్లిన బుఱదకూ, దుష్ప్రచారాలకూ ఆంద్రోల్లు చాలా బాధపడుతున్నారు. ఈ పదేళ్ళలో తెలంగాణవాదులు తమ మాటలతో చేష్టలతో ఆంద్రోల్లని కించపఱిచి అవమానపఱచి, దూషించి, భౌతిక దాడులు చేసి హింసించినంత స్థాయిలో ఆంద్రోల్లు తెలంగాణవారి పట్ల (వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ) ఎప్పుడూ ప్రవర్తించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇదొక నిష్కారణ ద్వేషం. ఇది దుష్ప్రచారాల ఫలితం. ఇదొక ప్రాంతీయ సంకుచితత్వం. ఇదొక నీచ, క్రూర ప్రాంతీయ రాజకీయం. అయినా ఇప్పటికీ న్యాయం తమ పక్షానే ఉందని తెలంగాణవాదులు ఛాతీ చఱచుకోవడం మిక్కిలి ఆశ్చర్యకరం.

    • నాగన్న
      Posted January 9, 2011 at 6:28 PM | Permalink

      “కానీ తటస్థత లోపించింది.”
      ఒప్పుకుంటున్నాను.

      ప్రాంతీయ సంకుచితత్వం, రాజకీయాలు నాకైతే రెండు వైపులా కనిపిస్తున్నాయి. న్యాయం ఎవరి వైపు ఉంది అని ఆలోచించామంటే, ధర్మం దెబ్బతిన్నది అని అర్ధం.

  6. sathya
    Posted January 9, 2011 at 1:30 AM | Permalink

    కలవడం అంటే పాలూ నీళ్లూ కావాలి..ఉప్పూ..నిప్పూ కాదు కదా..:)

    telagaana kavi raakhee gaaanna maaTalu

    • నాగన్న
      Posted January 9, 2011 at 6:30 PM | Permalink

      ఎవరు పాలు, ఎవరు నీళ్ళు అనే వాదం బయలుదేరకపోతే చాలు :)

  7. Posted January 10, 2011 at 12:18 AM | Permalink

    మళ్ళీ పాత పద్ధతిలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఏర్పఱచడం వల్ల ఈ ప్రాంతీయ గొడవలు శాశ్వతంగా సమసిపోయేలా చేయలేం. మళ్ళీ వాటిల్లో ఈ కేసీయారూ, దామోదర్ రెడ్డీ చేఱి మళ్ళీ ప్రాంతీయ దావానలాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతూంటారు. అంత మేధావులు (శ్రీకృష్ణ కమిటీ సభ్యులు) ఈ చద్ది/ నిస్తేజ పరిష్కారాన్ని ఎలా సూచించారో అర్థం కాకుండా ఉంది. రాష్ట్రం పేరుని తెలుగునాడు అని మార్చడం వల్ల చాలా ప్రయోజనముందని కొందఱు మేధావులు కమిటీకి సూచించారు. కానీ వారి నివేదికలో ఆ ఊసే లేదు. ఎందుకనో ?

    నా అభిప్రాయంలో – మానవహక్కుల కమిషన్ లాగా ఒక Andhra Pradesh Regional Parity Commission/ Tribunal ని సుప్రీమ్ కోర్టుకున్న సర్వోన్నత న్యాయనిర్ణయాధికారాలతో ఏర్పఱచాలి. అందులో ప్రముఖ జూరిస్టులే తప్ప రాజకీయ నాయకులుండకూడదు. ప్రాంతీయ దుర్విచక్షణకు సంబంధించిన అన్ని వివాదాల్నీ (APPSC నియామకాలూ, నీటి పంపకాలూ, బడ్జెట్ కేటాయింపుల దగ్గర్నుంచి రాష్ట్రకేబినెట్ లో ప్రాంతీయ కోటాలతో సహా) దానికి నివేదించే సావకాశం ఉండాలి. సర్వోన్నతాధికారమంటే – సదరు ట్రిబ్యునల్ ఒక నిర్ణయం చేశాక ఇహ అంతకంటే పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ ట్రిబ్యునల్ దే అంతిమనిర్ణయం/ అంతిమ ఆదేశం. ఇలాంటి సర్వోన్నతాధికారాలతో ఇప్పుడు భారతదేశంలో చాలా కమిషన్లూ, ట్రిబ్యునళ్లూ పనిచేస్తున్నాయి. దీనికి తెలంగాణవారు కూడా సమ్మతిస్తారనుకుంటాను.

    • నాగన్న
      Posted January 10, 2011 at 2:48 AM | Permalink

      వడ్డించే వాడు మనవాడు కానప్పుడు ఎక్కడ కూర్చున్నా, ఎంత తిన్నా పూర్తి సంతృప్తి దొరకడం కష్టం. అది తెలంగాణా వాదానికి, బ్రిటిష్ వారిపై పోరాటానికి, మద్రాసు రాష్ట్రం విడిపోవటానికి మూల కారణాలు.

      ప్రాంతీయ దుర్విచక్షణ గురించి సీమాంధ్ర ప్రజలు మాట్లాడరు, ఇన్ని సంవత్సరాల సమైక్యత వల్ల కలిగిన లాభాల గురించి తెలంగాణా ప్రాంత ప్రజలు మాట్లాడరు. సగం మాటలకు ఎవరైనా ఏం న్యాయం చెబుతారు?

  8. Posted January 10, 2011 at 12:49 AM | Permalink

    “అందులో ప్రముఖ జూరిస్టులే తప్ప రాజకీయ నాయకులుండకూడదు”

    హహహ! ఇప్పుడు అంతటి మేధావులైన జ్యూరిస్టులు చేసిన నిర్వాకం చూశాంగా!

    “ప్రాంతీయ దుర్విచక్షణకు సంబంధించిన అన్ని వివాదాల్నీ (APPSC నియామకాలూ, నీటి పంపకాలూ, బడ్జెట్ కేటాయింపుల దగ్గర్నుంచి రాష్ట్రకేబినెట్ లో ప్రాంతీయ కోటాలతో సహా) దానికి నివేదించే సావకాశం ఉండాలి”

    భేష్, ఇంక ప్రభుత్వం ఎందుకూ? గోళ్ళు గిల్లుకోవడానికా?

    ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వంతో సరైన పరిపాలన సాధ్యం కాదని ఒప్పుకున్నట్టేగా?

    “సదరు ట్రిబ్యునల్ ఒక నిర్ణయం చేశాక ఇహ అంతకంటే పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు”

    ఏం తెలివండీ, రాజకీయ పరిపాలన కోర్టుల చేతిలో పెట్టాలన్న మాట!

    “తెలంగాణవారు కూడా సమ్మతిస్తారనుకుంటాను”

    అది తమరి పగటికల మాత్రమే.

    • నాగన్న
      Posted January 10, 2011 at 2:53 AM | Permalink

      తాడేపల్లి గారు ప్రముఖ బ్లాగరు, తోటి తెలుగు వాడు, సహ భారతీయుడు. ఆయన్ని గౌరవించుకోవడం మనల్ని మనం గౌరవించుకున్నట్లు, లేదా మనల్ని మనం అవమానించుకున్నట్లు! అభిప్రాయాలు కలిసినా, కలవకపోయినా…

      దయచేసి గమనించగలరు.

  9. Posted January 10, 2011 at 3:31 AM | Permalink

    తెలంగాణవాదులు ప్రధానంగా గమనించాల్సిన విషయం. శ్రీకృష్ణ కమిటీలోని జూరిస్టులు తెలుగువారు కారు. ఈ రాష్ట్రంతో సంబంధం ఉన్నవారు అంతకంటే కారు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో గానీ, విడగొట్టడంలో గానీ వారికి ఏ విధమైన వెస్టెడ్ ఇంట్రస్టూ లేదు. వారు కేంద్రప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి తమ పరిశోధనను తాము చేసుకొని నిర్ణయాలనూ, పిండితార్థాలనూ వెలువరించారంతే ! మధ్యవర్తులుగా ఉన్న పాపానికీ, తాము చేయాల్సిన పనిని తాము చేసినందుకూ వారిని దూషించడం అసమంజసం. భావితరాలకూ, భవిష్యత్తులో దేశంలో తలెత్తగల అన్నివేర్పాటువాదోద్యమాలకూ దిక్సూచిలాంటి ఒక చారిత్రిక డాక్యుమెంట్ ని వారు మనకందించారు. వేర్పాటువాదులకు నిరాశోపహతిని కలిగించినంతమాత్రాన, లేదా వారి ప్రచారాన్ని అది ఖండించినంత మాత్రాన దాన్ని గిరవాటేయడం విజ్ఞత కాదు.

    మన వాళ్ళ మనస్తత్త్వాన్ని బట్టి , మన రాజకీయాల సంస్కృతిని బట్టి మీరు ఊహిచగలిగితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా అందులోకూడా ప్రాంతీయ వివాదాలు తప్పకుండా ఉంటాయి. వివాదాలు లేని, వివాదాలకే అవకాశం లేని వ్యవస్థలు ఎక్కడా ఉండవు. కానీ వివాదాల పరిష్కారానికి వ్యవస్థల్ని ఏర్పఱచుకోవడం ఆన్నిచోట్లా ఉన్నదే. అంతమాత్రాన సమైక్యరాష్టంలో వివిధప్రాంతాలకు న్యాయం జఱగదని చెప్పినట్లు కాదు. ఫ్యామిలీ కోర్టులున్నాయంటే వివాహవ్యవస్థ ఇహ పనికిరాకుండా పోయిందని అర్థం కాదు. వివిధప్రాంతాలకు సాధ్యమైనంత న్యాయం మొదట్నుంచీ జఱుగుతూనే ఉంది. ఇప్పటికీ జఱుగుతూనే ఉంది. ఆ సంగతి శ్రీకృష్ణకమిటీ నివేదిక ద్వారా స్పష్టమైంది. అయితే న్యాయం జఱగడమొక్కటే కాదు, జఱిగినట్లు కనిపించాలి కూడా అని వేర్పాటువాదోద్యమం మనకు గుణపాఠం నేర్పుతోంది. అలా కనిపించడంకోసమే , ఆ విధమైన పారదర్శకత కోసమే ఒక Tribunal లేదా Commission లాంటి వ్యవస్థ ఉండాలంటున్నాను.

  10. Posted January 10, 2011 at 3:38 AM | Permalink

    తాడేపల్లి వారు ప్రముఖ బ్లాగరు, మేధావి అనే విషయంలో నాదీ మీమాటే. అయితే తెలంగాణా విషయం వచ్చే సరికి ఆయన పద్ధతి మారి పోతుంది. ఉదాహరణకు ఆయన తన బ్లాగులొ చేసిన కొన్ని వ్యాఖ్యలు చూడండి.

    —తెలంగాణవాదుల సంకుచిత మనస్తత్త్వాన్ని బట్టి అలా జఱిగి తీఱుతుందని నాకనిపిస్తుంది. వారా మానసికస్థాయి నుంచి ఉన్నతంగా ఎదిగితే మంచిదే. ఎదక్కపోతేనే ఇబ్బందవుతుంది వారిక్కూడా ! ఎందుకు చెబుతున్నానంటే “ఒకచోట పిత్తే ముడ్డి ఇంకోచోట సంగీతం పాడదు” అని మనలో ఒక ముతకసామెత ఉంది…

    —తెలంగాణప్రాంతపు తిక్కల దృష్ట్యాను వారు భవిష్యత్తులో ఏ క్షణంలోనైనా ద్రోహం చేసే అవకాశం ఉంది.

    —వారు ఈ సంకుచితత్వాల్ని వదిలిపెట్టి మన ఆలోచనాస్థాయికి చేఱుకునేదాకా…

    తెలంగాణా పై పలు సందర్భాల్లో సదరు బ్లాగరు ఇంతటి నీచమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేను వాడిన భాష అంతకన్నా ఘోరమైంది కాదనే భావిస్తున్నాను.

  11. Posted January 10, 2011 at 4:02 AM | Permalink

    “శ్రీకృష్ణ కమిటీలోని జూరిస్టులు తెలుగువారు కారు. ఈ రాష్ట్రంతో సంబంధం ఉన్నవారు అంతకంటే కారు…”

    మీరు పైన వ్రాసిన “అంత మేధావులు (శ్రీకృష్ణ కమిటీ సభ్యులు) ఈ చద్ది/ నిస్తేజ పరిష్కారాన్ని ఎలా సూచించారో అర్థం కాకుండా ఉంది” అన్న వ్యాఖ్యాన్నే ఉటంకించడం జరిగింది. వారికి ఎలాంటి వెస్టెడ్ ఇంటరెస్టులు లేక పోయినా ఏం చేశారో మనం చూశాం. అలాంటిది మళ్ళీ కొంత మంది జ్యూరర్ల చేతిలో తెలంగాణావారి భవిష్యత్తు పెడదామని మీరు ఎలా అనుకుంటున్నారో అర్థంగాకుండావుంది. తెలంగాణావారు తమనుతాము పరిపాలించుకోలేని తెలివితక్కువవారని మీరు భావిస్తున్నారు కాబట్టే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తెలంగాణా వారికి తమ ప్రాంతాన్ని శాసించడానికి ఏ bunch of lawyers అవసరం లేదని గుర్తిస్తే మంచిది.

  12. Posted January 10, 2011 at 5:01 AM | Permalink

    ఆర్యా ! సందర్భాన్ని బట్టి మాటలకు వ్యాఖ్యానం చెప్పుకోవాలి. నేనన్నదాంట్లో నీచమేముంది ? నీచం ఏదైనా ఉంటే అది తెలంగాణవాదుల ప్రవర్తనలో ఉంది. అది అలా ఉందని దాన్ని ఉన్నదున్నట్లు నేను స్వభావోక్తిగా వర్ణించడంలో తప్పులేదు. నేను మొదట్నుంచీ తెలంగాణవాదులకూ ,తెలంగాణప్రజలకూ మధ్య ఒక క్లియర్ కట్ తేడా పాటిస్తూ వచ్చాను. ఒక దృష్టాంతం మీకు గుర్తు చేస్తాను. 1978 లో తెలుగుసినిమా పరిశ్రమని హైదరాబాదుకు తేవాల్సిందని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారు కోరినప్పుడు “ఇక్కడ మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయేమో” ననే ఆందోళనని అప్పటి సినీప్రముఖులు వెలిబుచ్చారు. “ఇక అలాంటి ఉద్యమాలు రానేరావు. మొన్న వచ్చినదే చిట్టచివఱిది. నాది పూచీ” అని చెన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత ఏమయిందో చూశాం కదా ! ఎవడో రెచ్చగొట్టాడని చెప్పి సరిగ్గా 31 ఏళ్ళ తరువాత కొందఱు తెలంగాణవాళ్ళు మళ్ళీ రోడ్డెక్కారు. ఇది తాడేపల్లివాడి సృష్టా ? అలాగే ఇప్పటి తెలంగాణ ఉద్యమం కూడా త్వరలోనే వీగిపోతుందనడంలో నాకేమీ సందేహం లేదు. కానీ ఇంకో పాతికేళ్ళ తరువాత ఇదే తెలంగాణలో కేసీయార్ లాంటి ఇంకో అసమ్మతినాయకుడు బయలుదేఱడనే గ్యారంటీ లేదు. అతన్నొక మహమ్మదు ప్రవక్తగా భావించి మళ్ళీ ఇంకొందఱు తెలంగాణవాళ్ళు రోడ్డెక్కరనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. అందుకే చరిత్రగుణపాఠాల్ని దృష్టిలో ఉంచుకొని హెచ్చఱికగా ఉండమని నేను వ్రాశాను. ఈ మూడ్ నుంచి తెలంగాణ బయటపడడం, తన ఆలోచనల / కార్యకలాపాల రేంజిని కోస్తావారి వలె ఇంకొంచెం విస్తారం చేసుకోవడం – ఇదొక్కటే , మళ్ళీ మళ్ళీ తిరగబెట్టేఈ వేర్పాటువాదపు టైఫాయిడ్ రోగానికి పరమౌషధం. అప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన జాగ్రతలు తాను తీసుకోవాలని నేను వ్రాశాను.

    తెలంగాణవాళ్ళు మనసుపెట్టి ఆలోచించగలిగితే, కాస్త తెలివిగా ఓర్పుపట్టగలిగితే, ఒక తరం తమది కాదనుకొని తాళితే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాధికారం యావత్తూ వారిదే. కోస్తావారికి రాజకీయాధికారం పట్ల ఆసక్తి లేదు గనుక ఇప్పడు రాయలసీమవారున్న పొజిషన్ లో అప్పుడు తెలంగాణవారుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 148 శాసనసభాస్థానాలు గల ప్రాంతానిదే రాజ్యాధికారం. మొత్తం 293 స్థానాలలో మొన్నటి దాకా తెలంగాణకు 107 స్థానాలు మాత్రమే ఉండేవి. మొన్న నియోజక వర్గాల పునర్విభజనలో 119 కి పెఱిగాయి. హైదరాబాదు నగరం అనూహ్యంగా విస్తరించడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే సమయంలో వరంగల్, ఖమ్మం నగరాలు కూడా విస్తరిస్తున్నాయి. కనుక మళ్ళీ ౩౦ ఏళ్ళ తరువాత పునర్విభజన జఱిగినప్పుడు తెలంగాణకు 140 కంటే ఎక్కువ పేఱోలగ స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.

  13. Posted January 10, 2011 at 5:49 AM | Permalink

    అయ్యా! మీ సమాధానానికి సంతోషం.

    కానీ కొన్ని విషయాలు గమనించండి.

    1969 లో తెలంగాణా ఉద్యమాన్ని తుంగలో తొక్కి అధికారపు అందలమెక్కిన చెన్నారెడ్డి 1978లో తెలంగాణా ప్రతినిధి ఎలా అయ్యాడు? ఎవరికి, ఎక్కడ మాట ఇచ్చి, ఏ దస్తావేజుపై సంతకం పెట్టాడు?

    1956, 1969లొ చేసుకున్న ఒప్పందాలు ఎవరిద్రోహం కారణంగా వీగిపోయాయి? పెద్దమనుషులంతా కలిసి రాసుకున్న ఒప్పందాలు, రాష్ట్రపతి ఉత్తర్వులకే దిక్కులేదు. ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించారని తెలంగాణా వారిని మీరు “ద్రోహులు” అని సంబొధించాల్సి వచ్చింది? “ఒకచోట పిత్తే ముడ్డి ఇంకోచోట సంగీతం పాడదు”, ఇది మాత్రం బాగా చెప్పారు, అందుకే మేం మీరు ఏదో ఉద్ధరిస్తారని నమ్మడంలేదు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనీయండి.

    “తెలంగాణవాళ్ళు మనసుపెట్టి ఆలోచించగలిగితే…”

    అయ్యా, మాకు మీ లెక్కలూ వద్దు, మీ ఊరింపులూ వద్దు. మాకున్నది మాకు చాలు. మిమ్మల్ని పరిపాలించాలనే కోరిక మాకేమాత్రంలేదు. మీ “మానసిక స్థాయి”కి ఎదగాలనే కోరిక మాకేమాత్రం లేదు.

  14. Posted January 10, 2011 at 6:13 AM | Permalink

    నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మళ్ళీ ఇక్కడ వ్యాఖ్యానించడానికి నేను రాకపోవచ్చు. మీరు కోరుకున్నది ఇచ్చే శక్తి సమైక్యవాదులకు లేదు.

    ఏమీ అనుకోవద్దు. నాకర్థం కాలేదు మీ ఘోష. ఇప్పుడు కూడా ఎవఱి బతుకులు వారు బతుకుతూనే ఉన్నారు. ఎవఱి బతుక్కి ఎవఱు అడ్డమొచ్చారు ? ఎవఱింట్లో ఎవఱు దూరారు ? ఎవఱి నోటిముందు కూడు ఎవఱు తీశారు ?

    “మీరు – మేము” అంటున్నారు. ఎవఱు ఈ “మీరు” ? ఎవఱు ఈ “మేము” ? అంతా అనుకోవడంలో ఉంది.

    సరే ! మీ అభీష్టం మీది. మీరు ఎదగొద్దు. అలాగే ఉండండి. ఇప్పుడు నష్టమేముంది ? అమాంతం ఎదిగిపొమ్మని ఇక్కడ ఎవ్వఱూ బలవంతం చేయడం లేదు. అయితే మీకు తెలియకుండానే మీరు ఎదిగేలా మేము (సమైక్యవాదులం) చేస్తాం. ఆ బాధ్యత మాది. ఎందుకంటే మాకు తప్పదు. 54 ఏళ్ళల్లో ఉర్దూ తెలంగాణని తెలుగు తెలంగాణగా మార్చాం కదా ! అలాగే ఇదీను.

    • Posted January 10, 2011 at 7:22 AM | Permalink

      అయ్యా తాడేపల్లి గారు,

      — “మీరు కోరుకున్నది ఇచ్చే శక్తి సమైక్యవాదులకు లేదు.”

      మీరు ఏదీ ఇవ్వావద్దు, మేం తీసుకోనూ వద్దు. మారాష్ట్రం మాహక్కు. అది మేం కేంద్రాన్ని కోరుతున్నాం, మిమ్మల్ని కాదు. మీరు ఇంకోసారి మోకాలు అడ్డు పెట్టకుంటే అదే పదివేలు.

      — “ఎవఱి బతుక్కి ఎవఱు అడ్డమొచ్చారు?”

      సంవత్సరం వెనక్కి వెళ్ళండి, గుర్తుకు వస్తుంది.

      — “ఎవఱు ఈ మీరు? ఎవఱు ఈ మేము?”

      బాగా చెప్పారు. “వారు భవిష్యత్తులో ఏ క్షణంలోనైనా ద్రోహం చేసే అవకాశం ఉంది”, “వారు ఈ సంకుచితత్వాల్ని వదిలిపెట్టి…”, ” వారిక్కూడా ! ఎందుకు చెబుతున్నానంటే” అని వ్రాసినప్పుడు గుర్తుకు రాలేదా?

      — “అయితే మీకు తెలియకుండానే మీరు ఎదిగేలా మేము (సమైక్యవాదులం) చేస్తాం”

      అయ్యా, చాలా సంతోషం. దయచేసి అలాంటి ప్రణాళిక మానుకోండి సారూ. మీరు ఇప్పటీదాకా చేసిన ఎదుగుదల చాలు. మీరు అనుకునే ఎదుగుదల వేరు, మేం అనుకునే ఎదుగుదల వేరు. మీక్కావల్సిన ఎదుగుదల మీ ప్రాంతంలొ భేషుగ్గా చేసుకోండి.

  15. నాగన్న
    Posted January 10, 2011 at 9:54 AM | Permalink

    @మీ ఇద్దరికి
    చివరి వ్యాఖ్యలను ఇంకా చదవలేదు… కానీ, ఈ వాదనల ద్వారా మనం ఏం సాధించామో ఒకసారి మళ్ళీ మనందరం ఆలోచించుకోవలసిన అవసరం ఉన్నది.

    గమనిక: మరో వ్యాఖ్యాత యొక్క రెండు వ్యాఖ్యలు ప్రచురించబడలేదు. వ్యక్తిగత విమర్శలు ఈ బ్లాగు స్పూర్తికి విరుద్ధం.

Post a Comment

Your email is never published nor shared. Required fields are marked *

*
*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>